నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏం చేసినా సంచలనమే. నటుడు నుంచి నిర్మాతగా మారిన ఆయన.. రాజకీయాల కోసం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే రాజకీయాలు పెద్దగా కలిసి రాకపోవడంతో.. బండ్ల గణేష్ మళ్ళీ నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తారని చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా ఆయన పాదయాత్ర వార్త తెరపైకి వచ్చింది.

షాద్ నగర్ లోని తన నివాసం (హైదరాబాద్) నుంచి తిరుమలకు పాదయాత్ర చేయాలని బండ్ల గణేష్ నిర్ణయించుకున్నారట. త్వరలోనే ఈ పాదయాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది. షాద్ నగర్ నుంచి తిరుమల మధ్య 500 కిలో మీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఇంత దూరం పాదయాత్రలు ఎన్నికలకు ముందు బడా నాయకులు మాత్రమే చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు బండ్ల గణేష్.. పాదయాత్రకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.

బండ్ల గణేష్ కొంతకాలంగా సినిమాలను, రాజకీయాలను పక్కన పెట్టి.. వ్యాపారాలపైనే పూర్తి ఫోకస్ పెడుతున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోనూ, అలాగే రాజకీయాల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నారట. అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ పాదయాత్ర తర్వాత బండ్ల.. పాలిటిక్స్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటారట. ఇక సినిమాల విషయానికొస్తే, ఒక భారీ బడ్జెట్ సినిమాతో నిర్మాతగా కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇప్పటికే ఒక స్టార్ హీరో.. బండ్ల బ్యానర్ లో సినిమా చేయడానికి సైన్ చేసినట్లు వినికిడి. మరి పాదయాత్ర తర్వాత.. సినీ, రాజకీయ రంగాల్లో బండ్ల గణేష్ ఎలాంటి ప్రభావం చూపుతాడో చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here