80వ దశకం వరకు తెలుగు హీరోయిన్లే టాలీవుడ్‌లో రాజ్యమేలారు. 90వ దశకం వచ్చేసరికి బాలీవుడ్‌ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకునే సాంప్రదాయం మొదలైంది. ఆ సమయంలోనే మలయాళంలో రూపొందిన ‘సర్గమ్‌’ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది విజయవాడకు చెందిన విజయలక్ష్మీ అలియాస్‌ రంభ. అయితే మొదటి సినిమాలో ఆమె పేరును అమృతగా వేశారు. ఆ తర్వాత ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంతో టాలీవుడ్‌లోకి వచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌ పేరు రంభ. చివరికి దాన్నే స్క్రీన్‌ నేమ్‌గా మార్చుకున్నారు. తెలుగు, తమిళ్‌, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పురి, బెంగాలి, ఇంగ్లీష్‌ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించిన రంభ చివరగా 2011లో మలయాళంలో రూపొందిన ‘ది ఫిలిం స్టార్‌’ అనే సినిమాలో కనిపించారు. 2008లో వివాహం చేసుకున్న ఆమె అప్పటివరకు కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేశారు. 2009 నుంచి 2017 వరకు పలు భాషల ఛానల్స్‌లోని షోలకు గెస్ట్‌గా, జడ్జిగా వ్యవహరించారు. దాదాపు 8 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత 2025లో స్టార్‌ విజయ్‌ ఛానల్‌లో ప్రారంభమైన ఒక షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, బాలకృష్ణ వంటి టాప్‌ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రంభ ఇప్పుడు సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు గ్లామర్‌ హీరోయిన్‌గా కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన రంభ ఇప్పుడు పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తన జీవితంలో సినిమా అనేది ఫస్ట్‌ లవ్‌ అని చెబుతోంది రంభ. సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇది సరైన సమయంగా తాను భావిస్తున్నాను అంటోంది. ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ చేసి మెప్పించడం ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నట్టు తెలియజేసారు. తన నటనతో సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు వస్తున్న రంభకు ఎలాంటి క్యారెక్టర్స్‌ వస్తాయో, ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందో తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here