ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. 2024 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టి, ఘన విజయం సాధించింది. (Jr NTR)
దేవర మూవీ రెండు భాగాలుగా అలరించనుందని విడుదలకు ముందే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దేవర-1 కంటెంట్ పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కేవలం ఎన్టీఆర్ స్టార్డం తోనే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిందనే అభిప్రాయాలున్నాయి. దీంతో ఎన్టీఆర్ ‘దేవర-2’ చేయడం అనుమానమే అనుకున్నారంతా. కానీ ఎన్టీఆర్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ‘దేవర-2’ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల తన టీంతో కలిసి ‘దేవర-2’ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట. జూన్ నాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యే అవకాశముంది అంటున్నారు. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందట. మరోవైపు ఎన్టీఆర్, ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్ ‘వార్-2’తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘డ్రాగన్’ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘డ్రాగన్’ షూటింగ్ ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. ‘డ్రాగన్’ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే.. ‘దేవర-2’ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట ఎన్టీఆర్. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2027 సంక్రాంతికి దేవర-2 థియేటర్లలో అడుగుపెట్టే అవకాశముంది. కాగా, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో సైతం ఎన్టీఆర్ ఒక సినిమా కమిటై ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ ‘దేవర-2’ తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.