గత కొద్ది నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా పలు హోటల్స్ లో తనిఖీలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఆహారంలో నాణ్యత లోపించినా, పరిసరాలు శుభ్రంగా లేకపోయినా ఆ హోటల్స్ పై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఆయా హోటల్స్ లో తనిఖీలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రముఖ హోటళ్ల బండారం బయటపడింది. ఇప్పుడు ఈ లిస్టులో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) కి చెందిన ‘వివాహ భోజనంబు’ (Vivaha Bhojanambu) రెస్టారెంట్ కూడా చేరింది.

సికింద్రాబాద్ లోని వివాహ భోజనంబు హోటల్ లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2022 నాటికి గడువు ముగిసిన 25 కిలోల చిట్టిముత్యాల రైస్ బ్యాగ్ ను గుర్తించినట్లు తెలిపారు. అలాగే, సింథటిక్ ఫుడ్ కలర్‌తో ఉన్న 500 గ్రాముల కొబ్బరి తురుము కనుగొన్నామని పేర్కొన్నారు. స్టీల్ పాత్రల్లో ఉంచిన ఫుడ్ కి సరైన లేబుల్స్ లేవని చెప్పారు. కిచెన్ లో డ్రైన్ వాటర్ నిల్వ ఉండిపోయిందని, కొన్ని డస్ట్‌బిన్‌లు మూతలతో కప్పబడలేదని తెలిపారు. అలాగే, ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని అన్నారు. అంతేకాదు, ఆహార తయారీలో మరియు కస్టమర్లకు అందించే బబుల్ వాటర్ కి సంబంధించిన ‘వాటర్ ఎనాలిసిస్ రిపోర్ట్’ కూడా లేదని చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఫుడ్ సేఫ్టీ అధికారుల పుణ్యమా అని మరో హోటల్ బండారం బయటపడింది. ఇప్పటికే.. బయటకెళ్ళి ఏదైనా తినాలంటే ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నన్ని డబ్బులు పెట్టి మరీ, అనారోగ్యం తెచ్చుకోవడం ఎందుకని.. చాలామంది “హోటల్ ఫుడ్ వద్దు.. ఇంటి ఫుడ్ ముద్దు” అని డిసైడ్ అయ్యారు. ఓ రకంగా ఇది మంచి పరిణామమే. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తమ తనిఖీలను ఇలాగే కొనసాగిస్తే.. హోటల్ నిర్వాహకుల్లో భయం కలిగి.. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండే అవకాశముంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here