యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ రెండు పెళ్ళిళ్లు చేసుకొని వారితో విడిపోయిన తర్వాత నటి గౌతమితో లైఫ్‌ పార్టనర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెతో కూడా తెగతెంపులు చేసుకున్నాడు. గౌతమి కూడా కమల్‌తో విడిపోయిన తర్వాత 2016 నుంచి ఒంటరిగానే ఉంటోంది. ఇదిలా ఉంటే.. గౌతమి ఓ భూ వ్యవహారంలో ఘోరంగా మోసపోయింది. ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని ఏడాదిగా పోరాటం చేస్తోంది. న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని గౌతమి స్పష్టం చేస్తోంది. 

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి ఓ స్థలం ఉంది. దాన్ని కారైక్కుడికి చెందిన అళగప్పన్‌ కబ్జా చేశాడు. ఆ తర్వాత దానికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని అమ్మేశాడు. రూ. 3 కోట్ల విలువ చేసే తన స్థలాన్ని తన ప్రమేయం లేకుండా విక్రయించడంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది గౌతమి. తన ఫిర్యాదులో అళగప్పన్‌, ఆయన భార్య నాచ్చాళ్‌, కుమారుడు శివ, కోడలు ఆర్తి, ఇంకా కొందరు బంధువులపై  కేసు పెట్టారు గౌతమి. 

కేసు నమోదైన వెంటనే బెయిల్‌ తెచ్చుకున్నారు నిందితులు. ఏడాదిగా వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తాజాగా మరోసారి నిందితులు బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకున్నారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. దీనిపై స్పందించిన గౌతమి తరఫు లాయర్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ నిందితులకు బెయిల్‌ ఇవ్వకూడదంటూ వాదించారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుంది? గౌతమికి న్యాయం జరుగుతుందా? వంటి ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. మరి బెయిల్‌కి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here