ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వైజయంతి మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘కల్కి 2898ఎడి’ ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు రూ.1100 కోట్లకుపై వసూళ్ళు రాబట్టి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కథ, కథనాలు, సినిమాలోని పాత్రల విషయంలో కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ అవి కలెక్షన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. థియేటర్లలో ఈ సినిమాని చూడనివారు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ చేస్తారా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ‘కల్కి’ చిత్రాన్ని ఆగస్ట్‌ 22 నుంచి ఓటీటీలో అందుబాటులోకి తెస్తున్నారు మేకర్స్‌. అయితే ఇందులో ఓ తిరకాసు ఉంది. అందరికీ ఈ సినిమా చూసే అవకాశం ఉందో లేదో తెలియదుగానీ చిత్ర యూనిట్‌ ఇచ్చిన ట్విస్ట్‌ మాత్రం అలాగే ఉంది.

సాధారణంగా ఇలాంటి పాన్‌ ఇండియా సినిమా ఓటీటీలో రిలీజ్‌ అయిందంటే అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. కానీ, ‘కల్కి’ విషయంలో అలా జరగడం లేదు. అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో వీక్షించే అవకాశం ఉంది. అతి ముఖ్యమైన హిందీ వెర్షన్‌ మాత్రం అమెజాన్‌ ప్రేక్షకులకు అందుబాటులో లేదు. హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే సౌత్‌ని అమెజాన్‌, నార్త్‌ని నెట్‌ఫ్లిక్స్‌ పంచుకున్నాయన్నమాట. ఏది ఏమైనా ఆగస్ట్‌ 22 నుంచి ఓటీటీలో ‘కల్కి’ సందడి మొదలు కాబోతోంది. 

ఓటీటీ అప్‌డేట్‌ వచ్చిన తర్వాత ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఆగస్ట్‌ 22 కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. సినిమాలోని చివరి అరగంట ఎంతో కీలకమనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాన్ని రిపీటెడ్‌ చూడడం ద్వారా ఓటీటీలో కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తామంటూ డార్లింగ్‌ ఫ్యాన్స్‌ చెబుతున్నారు. ప్రభాస్‌ గత చిత్రం సలార్‌ ఎన్నో వారాలపాటు ట్రెండ్‌ అయింది. ఇప్పుడు ‘కల్కి’ని కూడా టాప్‌ లెవల్‌కి తీసుకెళ్తామంటూ ఉత్సాహంగా చెబుతున్నారు ఫ్యాన్స్‌. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here