మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆమధ్య ‘రాయన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుందని, డిసెంబర్ 20న విడుదల కానుందని న్యూస్ కూడా వినిపించాయి. కానీ మధ్యలో ఈ సినిమా మళ్ళీ వాయిదా అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. అయితే త్వరలోనే ఫ్యాన్స్ ని మూవీ టీం ఫుల్ ఖుషీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రచారం జరిగినట్లుగానే ‘గేమ్ ఛేంజర్’ సినిమాని డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. వినాయక చవితి (సెప్టెంబర్ 7) కానుకగా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఇది మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చే న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో మూడేళ్ళ క్రితం మొదలైంది. మధ్యలో డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్-2’తో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దానికితోడు ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఒక సాంగ్, రెండు పోస్టర్లు తప్ప పెద్దగా అప్డేట్స్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ అప్డేట్ అనేది ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతుంది అనడంలో సందేహం లేదు.