సినీ పరిశ్రమలో సెంటిమెంట్ లు ఎక్కువగా నమ్ముతారు. ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులతో సినిమాలు చేయడానికి హీరోలు వెనకడుగు వేస్తుంటారు. కానీ అందరిది ఒక దారి అయితే, తనది మాత్రం మరో దారి అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అడుగులు వేస్తుంటాడు. ఫ్లాప్ లో ఉన్న దర్శకుడితో సినిమా చేసి హిట్ కొట్టడం కొన్నేళ్లుగా ఎన్టీఆర్ కి అలవాటుగా మారింది. ఇప్పుడు ‘దేవర’ (Devara) మూవీ విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

2015 నుంచి ఎన్టీఆర్ కి ఒక్క పరాజయం కూడా ఎదురుకాలేదు. ఆయన నటించిన గత ఆరు చిత్రాలు విజయవంతమయ్యాయి. అంతేకాదు ఆ ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలు ఫ్లాప్ డైరెక్టర్స్ తో చేసినవే కావడం విశేషం. ‘టెంపర్’ సినిమాకి ముందు పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. టెంపర్ తో తాను సక్సెస్ ట్రాక్ లోకి రావడమే కాకుండా తారక్ కి మంచి విజయాన్ని ఇచ్చాడు పూరి. అలాగే ‘1 నేనొక్కడినే’ వంటి ఫ్లాప్ తర్వాత తారక్ తో ‘నాన్నకు ప్రేమతో’ తీసి హిట్ కొట్టాడు సుకుమార్. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి భారీ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ చేసి విజయాన్ని అందుకున్నాడు బాబీ. త్రివిక్రమ్ కూడా ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్ తర్వాత, తారక్ తో ‘అరవింద సమేత’ చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడదే బాటలో కొరటాల శివ (Koratala Siva) కూడా ‘దేవర’తో హిట్ కొడతాడని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘దేవర’. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అయితే దీనికి ముందు కొరటాల చేసిన చిత్రం ‘ఆచార్య’ ఘోర పరాజయం పాలైంది. దీంతో కొరటాలతో సినిమా చేసే విషయంలో ఎన్టీఆర్ వెనక్కి తగ్గుతాడని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘ఆచార్య’ పరాజయాన్ని పట్టించుకోకుండా, కొరటాల ప్రతిభ మీద నమ్మకంతో ‘దేవర’ చేశాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కొరటాల ఈ సినిమాని అద్భుతంగా రూపొందించాడని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విజువల్ ట్రీట్ లా ఉందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఫ్లాప్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ హిట్ సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. ‘దేవర’తో కొరటాల అదిరిపోయే విజయాన్ని అందుకోవడం ఖాయమని తారక్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here