పాతతరం హీరోలకు, ఇప్పటి హీరోలకు చాలా వ్యత్యాసం ఉంది. ఆరోజుల్లో హీరోలు సినిమాపై ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చేవారు. వారికి పారితోషికాల కంటే పాత్రలు ముఖ్యం, తద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టలు ముఖ్యం. టాప్‌ హీరోల రేంజ్‌లో ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి హీరోలు పారితోషికం విషయంలో నిర్మాతలకు వెసులుబాటు కల్పించేవారు. తనతో సినిమా చేసే నిర్మాత నష్టపోకూడదు అనే నైతిక భావంతో ఉండేవారు. కాలం మారింది, దానితోపాటే హీరోలు కూడా మారారు. ప్రస్తుతం పలు ఇండస్ట్రీల్లో ఉన్న స్టార్‌ హీరోలు డబ్బే ధ్యేయంగా సినిమాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే తమ పారితోషికాలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్లిపోతున్నారు హీరోలు. సినిమా ఫలితం ఎలా ఉన్నా తమ పారితోషికాల విషయంలో మాత్రం హీరోలు ఖరాఖండీగా వ్యవహరిస్తున్నారు. 

కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే డిజాస్టర్స్‌ అవుతుంటాయి. ఇలాంటి సందర్భంలో కొందరు హీరోలు తమ పారితోషికం వాపసు ఇచ్చారు కూడా. అయితే అందరూ అదే పంథాలో మాత్రం వెళ్లడం లేదు. హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలని, అలా చేస్తేనే ఇండస్ట్రీ మనుగడ సాధించగలదని ఎన్నో సందర్భాల్లో సినీ పెద్దలు మాట్లాడారు. కానీ, హీరోలెవ్వరూ ఆ దిశగా ఆలోచించలేదు. అయితే తమిళ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ స్టార్‌ హీరోలకు ఓ సలహా ఇస్తున్నారు. హీరోలు పారితోషికాలు తగ్గించుకోవాలని, లేదంటే సినిమా మనుగడ కష్టమవుతుందని, థియేటర్ల వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కరోనా తరవాత చిత్రసీమ మరింత ఇబ్బందులకు లోనైందని, థియేటర్లు మూతపడ్డాయని గుర్తు చేశారు. కొంతమంది నిర్మాతలు కాంబినేషన్ల మోజులో పడి హీరోల మార్కెట్‌కి మించి రెమ్యునరేషన్లు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీరోలు పారితోషికాలు తీసుకోకుండా సినిమాల్లో వాటాలు తీసుకొని పని చేస్తే ఇంకా మంచిదంటున్నారు. అలా కాకుండా సినిమా, సినిమాకీ పారితోషికాలు పెంచేసి కోట్లు సంపాదించాలి అనే ఆలోచన చేస్తే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు వెట్రిమారన్‌. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here