విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు (Sree Vishnu). అయితే ఈమధ్య ఆయన సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ లు, బూతు పదాలు ఎక్కువైపోతున్నాయి. అటువంటి మాటలను సెన్సార్ కి కూడా చిక్కకుండా అర్థమై అర్థంకానట్టుగా చెప్పడం శ్రీవిష్ణు శైలి. ఆయన సినిమా విడుదలైన కొద్దిరోజులకు.. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. శ్రీవిష్ణు డబుల్ మీనింగ్ డైలాగ్ లు, బూతు మాటలకు సోషల్ మీడియాలో ఎందరో అభిమానులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే తన నెక్స్ట్ మూవీలో మరింత డోస్ పెంచినట్టు ఉన్నాడు.

‘రాజ రాజ చోర’ తర్వాత శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘SWAG’ (శ్వాగణిక వంశానికి స్వాగతం). అక్టోబర్ 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ బాగుంది. విభిన్న కథతో శ్రీవిష్ణు-హసిత్ గోలి కాంబో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతోంది. అయితే ట్రైలర్ బాగున్నప్పటికీ, అందులోని కొన్ని డైలాగ్ లే ఇబ్బందికరంగా ఉన్నాయి. పురుషాంగం, వృషణములు వంటి పదాలను ఉపయోగించారు. హీరోయిన్ రీతూ వర్మ నోటి వెంట “పురుషాంగానికి ప్రాకులాట ఎక్కువ” అనే డైలాగ్, అలాగే శ్రీవిష్ణు నోటి వెంట “మేము చూసింది చూచినచో మీవి వణుకుతాయి వృషణములు” అనే డైలాగ్ వినిపించాయి. ఇవి చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. (Swag Trailer)

అసలే ఓటీటీ పుణ్యమా అని ఇప్పటికే బూతులు ఎక్కువైపోయాయి. చిన్న పిల్లల ముందు ఏదైనా సిరీస్ లేదా సినిమా చూడాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు ఫీచర్ సినిమాలకు కూడా ఈ బూతు ట్రెండ్ అంటుకుంది. ముఖ్యంగా శ్రీవిష్ణు ఈ బూతు ట్రెండ్ ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నట్టున్నాడు. ఒకప్పుడు జంధ్యాల లాంటి వారు క్లీన్ కామెడీని అందించేవారు. కానీ ఇప్పుడు కామెడీ అంటే బూతు అనేలా మార్చేస్తున్నారు. పురుషాంగం, వృషణములు వంటి పదాలు విని వాటి అర్థం ఏంటని పిల్లలు అడిగితే.. తల్లిదండ్రులు ఏం చెప్పగలరు? అసలు పిల్లలను తీసుకొని సినిమాకి వెళ్లే సాహసం పేరెంట్స్ చేయగలరా?. హాస్యం అంటే నలుగురు నవ్వుకునేలా ఉండాలి కానీ, నలుగురు అపహాస్యం చేసేలా కాదు. ‘అచ్చ తెలుగు సినిమా’ అని ప్రచారం చేసుకుంటున్న స్వాగ్ చిత్ర బృందం.. అచ్చ తెలుగు బూతు పదాలను పెట్టి గొప్పగా భావిస్తున్నట్టుంది. ఇకనైనా చిత్ర బృందం మేల్కోవాలి. ముఖ్యంగా శ్రీవిష్ణు తన తీరు మార్చుకోవాలి. లేదంటే ఆయన పూర్తిగా కుటుంబ ప్రేక్షకులకు దూరమయ్యే ప్రమాదముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here