అప్పట్లో డబ్బింగ్ సినిమాలను తెలుగు పేర్లతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు. కానీ ఈమధ్య టైటిల్స్ విషయంలో అసలు శ్రద్ధ తీసుకోవట్లేదు. ముఖ్యంగా తమిళ సినిమాలను అవే టైటిల్స్ తో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. వలిమై, వేట్టయన్ వంటి సినిమాలు ఆ కోవలోకి చెందినవే. అదే తెలుగు సినిమాలను మన టైటిల్స్ తో తమిళ్ లో విడుదల చేస్తే ఊరుకుంటారా? తెలుగు ప్రేక్షకులు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు అంటూ ఇప్పటికే పలువురు సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత అబ్బూరి రవి వారికి తోడయ్యారు.

“తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు” అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా అబ్బూరి రవి కీలక వ్యాఖ్యలు చేశారు. “డబ్బింగ్ సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమా లో,  ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి చక్కగా మార్చేవారు. అది కూడా మానేసి విడుదల చేస్తున్నారు. వారి వారి భాష లలో వారి గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవిస్తాను. కానీ, తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం నచ్చట్లేదు. తెలుగుని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం, ఆ చిత్రాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం అని మాత్రం నేను అనుకోవట్లేదు.” అని రాసుకొచ్చారు. ఇన్నిరోజులకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ విషయంలో ఒకరు స్పందించారంటూ అబ్బూరి రవికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here