నల్గొండ ప్రజలకు మూసీ బాధలు ఇంకెన్నాళ్లు
మూసీ ప్రక్షాళనలో భాగంగా శుద్ధీకరణ, నదికి పునరుజ్జీవం కల్పించాల్సిన అత్యవసర పరిస్థితిని జిల్లా ప్రజలు, మూసీ పరీవాహక ప్రాంత రైతాంగంలోకి విస్తృతంగా తీసుకువెళ్లే పనిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. మూసీ ప్రక్షాళణ విషయంలో ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ఎండగట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో మల్లన్నసార్ నుంచి యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు తాగునీరు అందించే ప్రాజెక్టును రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనుండగా ఈ పనులకు సీఎం రేవంత్ రెడ్డి 8వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ‘‘ దశబ్ధాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. కాళ్లు, చేతులు వంకర్లుపోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్చిపోతుంటే.. బీఆర్ఎస్ పార్టీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు ..’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన సమీక్ష సమావేశంలో ఆగ్రహంవ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మూసీ బాధితులను రెచ్చగొట్టి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తున్నాయని.. పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేసి ఈ తప్పుడు ప్రచారాలను అడ్డుకోవాలని కూడా మంత్రి సమీక్ష సమావేశం నిర్ణయించింది. అన్ని జిల్లాల ప్రజలు గోదావరి, కృష్ణానీళ్లతో వ్యవసాయం చేస్తూ, తాగునీటిని వాడుకుంటుంటే.. భయంకరమైన రసాయనలు కలిసిన మురికినీళ్లను ఉమ్మడి నల్గొండ ప్రజలు ఎందుకు వాడుకోవాలన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.