అక్కినేని నాగార్జున కుటుంబంపై, నాగచైతన్య మాజీ భార్య సమంతపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబంలోని అందరూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అయితే వాటిని బయట పెట్టకుండా చట్టపరంగా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆమెపై పరువు నష్టం దావా వెయ్యడంతోపాటు ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చారు. 

రెండు నెలల క్రితం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దానికి కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్‌ సింగ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి తన వాదన వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాగార్జునగారి కుటుంబంపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణ కోరుతూ పోస్టు పెట్టారు’ అంటూ దాన్ని కోర్టు ముందు చదివి వినిపించారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న కొండా సురేఖ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆమె క్రిమినల్‌ చర్యలకు అర్హురాలని అన్నారు. 

తాజాగా నవంబర్‌ 21న మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. నాంపల్లి కోర్టులో ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ.. ఉద్దేశపూర్వకంగా తన క్లయింట్‌ ఆ వ్యాఖ్యలు చేయలేదని, కేటీఆర్‌ వలన కొందరు ఆడపిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతూ సమంత పేరును ఉదహరించారు తప్ప మరో కారణం లేదన్నారు. పిటిషనర్‌ మరొకరి అభిప్రాయాలతో కూడిన పిటిషన్‌ వేశారని, అది అర్హత లేనిదని, దాన్ని కొట్టివేయాలని వాదించారు. వాదన విన్న కోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here