తారాగణం: అశోక్‌ గల్లా, మానస వారణాసి, దేవదత్త నాగే, ఝాన్సీ, దేవయాని, గెటప్ శ్రీను, శత్రు, సంజయ్ స్వరూప్ తదితరులు 

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్

ఎడిటర్: తమ్మిరాజు

ఆర్ట్ డైరెక్టర్: జి.ఎం. శేఖర్

కథ: ప్రశాంత్‌ వర్మ

మాటలు: సాయిమాధవ్‌ బుర్రా

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల

నిర్మాత: సోమినేని బాలకృష్ణ

బ్యానర్: లలితాంబికా ప్రొడక్షన్స్

విడుదల తేదీ: నవంబర్ 22, 2024 

మహేష్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా హీరోగా నటించిన రెండో చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి, ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. ఈమధ్య దైవం నేపథ్యంలో వస్తున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నాయి. మరి ‘దేవకీ నందన వాసుదేవ’ ఎలా ఉంది? ‘హనుమాన్’ స్థాయిలో మెప్పించేలా ఉందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కంసరాజు (దేవదత్త నాగే) మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. అయితే అతడు దేవుడిని నమ్ముతాడు. కంసరాజు ఒకసారి కాశీకి వెళ్ళగా, తన చెల్లెలి మూడో సంతానం వల్ల ప్రాణహాని ఉందని అక్కడ ఒక సాధువు చెప్తాడు. దీంతో తన చెల్లి(దేవయాని)కి మూడో సంతానం కలగకూడదనే ఉద్దేశంతో, కడుపుతో ఉందని కూడా చూడకుండా.. ఆమె భర్తను చంపేస్తాడు కంసరాజు. ఆ తర్వాత ఓ హత్య కేసులో కంసరాజు జైలుకి వెళ్తాడు. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత, కంసరాజు మేనకోడలు సత్య(మానస వారణాసి)ను కృష్ణ(అశోక్‌ గల్లా) ప్రేమిస్తాడు. మరోవైపు జైలు నుంచి కంసరాజు బయటకు వస్తాడు. అదే సమయంలో కంసరాజుపై ఒక ఎటాక్ జరగగా.. ఆ ఎటాక్ నుంచి కాపాడి, కృష్ణ అతనికి దగ్గరవుతాడు. సత్య-కృష్ణ ప్రేమకథ గురించి కంసరాజుకి తెలిసిందా? కృష్ణ ఏ ఉద్దేశంతో కంసరాజుకి దగ్గరయ్యాడు? కంసరాజు దగ్గర అతని చెల్లి దాచిన నిజమేంటి? సత్య కుటుంబ వివరాలు తెలిశాక కృష్ణ ఏం చేశాడు? చివరికి సత్య-కృష్ణ ఒక్కటయ్యారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:

మైథలాజికల్ టచ్ తో వచ్చే సోషల్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా ఆ కోవలోకి చెందినదే. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగినప్పటికీ, అన్ని హంగులతో బోర్ కొట్టకుండా మలిచారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. ట్విస్ట్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుంది. ట్విస్ట్ తర్వాత కథనంలో వేగం పెరుగుతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే, సెకండ్ హాఫ్ చాలా మెరుగ్గా ఉంది. 

పురాణాలను సాంఘిక కథకు ముడిపెడుతూ ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర కథను అందించాడు. ఆ కథను అంతే అందంగా తెర మీదకు తీసుకురావడంలో అర్జున్‌ జంధ్యాల సక్సెస్ అయ్యాడు. రొమాన్స్, ఫ్యామిలీ, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ని జోడించి ఫుల్ మీల్స్ లా సినిమాని మలిచాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేసిన తీరు అదిరిపోయింది. అయితే కొన్ని నెగటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ని ఇంకా బాగా రాసుకొని ఉండొచ్చు. అలాగే కొన్ని సీన్స్ సినిమాటిక్ గా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ మీద కూడా మరింత వర్క్ చేసి ఉండాల్సింది.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం మెప్పించింది. ప్రసాద్‌ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్ ల కెమెరా పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

ఈ సినిమాలో అశోక్‌ గల్లా తన వయసుకి, పర్సనాలిటీకి మించిన పాత్ర చేసినప్పటికీ, కృష్ణగా తనదైన నటనతో మెప్పించాడు. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ పరిణితి కనబరిచాడు. మానస తెరమీద చూడటానికి అందంగా ఉంది. నటన కూడా పరవాలేదు. పవర్ ఫుల్ విలన్ గా కంసరాజు పాత్రకు దేవదత్త నాగే పూర్తి న్యాయం చేశాడు. కంసరాజు చెల్లెలుగా దేవయాని, కృష్ణ తల్లిగా ఝాన్సీ ఆకట్టుకున్నారు. గెటప్ శ్రీను, శత్రు, సంజయ్ స్వరూప్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఫైనల్ గా…

మైథలాజికల్ టచ్ తో రూపొందిన ‘దేవకీ నందన వాసుదేవ’ను.. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా మలిచారు.

రేటింగ్: 2.75/5

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here