ధర్మపురికి దక్షిణకాశీ అనే పేరూ దక్కింది. ఈ నదిలో స్నానం చేసి, పితృ దేవతలకు శ్రాద్ధ విధులు నిర్వహిస్తే, ముక్తి కలుగుతుందంటారు. కాశీలో మాదిరి ఇక్కడ పితృకార్యాలు చేసినవారు, వంశాభివృద్దిని పొందుతారని భక్తుల విశ్వాసం. యమధర్మరాజు పాపాత్ములను చూస్తూ, శిక్షిస్తూ, ఆ పాప సంచయం కొంత మూట కట్టుకున్నాడు. దాని పరిహారార్ధం ధర్మపురి చేరి నరసింహస్వామిని సేవించాడు. యముడి పాపాలన్నీ తొలగాయి. ఆయన ధర్మపురిని దర్శించాడనటానికి అక్కడున్న యమగుండాన్ని సాక్ష్యంగా చెబుతారు. యమగుండంలో స్నానం చేస్తే యమగండం తప్పుతుందంటారు. మదన పూర్ణిమ రోజు ఇక్కడ జరిగే తెప్పోత్సవం, రథోత్సవం కనువిందు చేస్తాయి. ధర్మపురి రథోత్సవంలో పాల్గొంటే వేయి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ రోజు వేలాది భక్తులు తరలివచ్చి ‘శ్రీధర్మపురి నివాస- దుష్టసంహార నరసింహ దురితదూర’ అంటూ ప్రార్థిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.