ప్రియురాలిపై ఉన్న వ్యామోహం వల్ల క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని పాతాళానికి తొక్కేసింది. కన్నడ సినీ రంగంలో ఉజ్వలంగా సాగుతున్న అతని కెరీర్‌కి బ్రేక్‌ పడింది. సరిదిద్దుకోలేని తప్పు అతన్ని, అతని కుటుంబాన్ని అయోమయంలో పడేసింది. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దర్శన్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత అతనికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. బయటి ప్రపంచానికి కనిపించకుండా తన కుటుంబంతో ఇంట్లోనే ఉంటున్నాడు దర్శన్‌. అయినా అతనికి ప్రశాంతత లేదు. ఈ హత్య కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. దర్శన్‌తోపాటు మిగతా నిందితులపై కూడా అదనపు చార్జిషీటు దాఖలు చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. 

రేణుకాస్వామి హత్య అనంతరం మూడు వేల పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేశారు పోలీసులు. ఇప్పుడు అదనపు చార్జిషీటు దాఖలు చేయడానికి కారణం.. కేసులో మరిన్ని సాక్ష్యాలు, నేర నిరూపణకు ఉపయోగపడే కొన్ని ఫోటోలు పోలీసులకు లభించాయి. అందుకే 1300 పేజీలతో కూడిన చార్జిషీటును దాఖలు చేస్తున్నారు. ఈ చార్జిషీటు కేసుకు అత్యంత కీలకంగా మారబోతోంది. ఎందుకంటే హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్‌ పర్సనల్‌ స్టాఫ్‌లోని పవన్‌ అనే నిందితుడు కూడా ఉన్నాడు. అతను హత్యాస్థలంలో కొన్ని ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, అతను కొన్ని ఫోటోలను డిలీట్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో వాటిని కూడా రీస్టోర్‌ చేయగలిగారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఆ ఫోటోల్లో దర్శన్‌ ఉన్నాడు. అంతేకాదు, ఇతర నిందితులు వాడిన కారు ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. వీటితోపాటు మరో మంది 30 సాక్షుల వాంగ్మూలాలు, 40కి పైగా సాక్ష్యాధారాల్ని కొత్త చార్జిషీటులో పొందుపరిచారు.

రేణుకాస్వామి హత్య కేసును బెంగళూరు పోలీసులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకే దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ వచ్చిన తర్వాత ఆ బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీమ్‌ కోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. దర్శన్‌, పవిత్రగౌడ్‌తోపాటు ఇతర నిందితులు సాధారణ బెయిల్‌ కోసం పెట్టుకున్న పిటిషన్‌పై వాదనలు వినేందుకు 26వ తేదీకి వాయిదా వేసింది బెంగళూరు హైకోర్టు. అనారోగ్య కారణాల వల్ల దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది కోర్టు. అతని వెన్నెముక ఆపరేషన్‌ నిమిత్తం ఈ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఆరు వారాల్లోపు చికిత్స పూర్తి చేసుకొని కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈలోగా సాధారణ బెయిల్‌ వస్తుందని దర్శన్‌ ఆశ పడ్డాడు. ఇప్పుడు అదనపు చార్జిషీటు దాఖలు చేస్తుండడంతో ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవిధంగా దర్శన్‌ చాప్టర్‌ ముగిసినట్టే. తాజా చార్జిషీటుతో నిందితుల్ని నేరస్తులుగా పరిగణించి శిక్ష విధించే అవకాశం ఉందని సమాచారం. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here