కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ మారిపోయింది. తెలుగు హీరోలు, దర్శకులతో సినిమాలు చేయడానికి ఇతర భాషల వారు పోటీ పడుతున్నారు. ఏదో ఒక్క సినిమా చేసి ఆగిపోకుండా, తెలుగులో వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మూడు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. నాలుగో సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పుడిదే బాటలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి పయనించడానికి సిద్ధమవుతున్నాడు. (Rishab Shetty)

‘కాంతార’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. తెలుగులోనూ ‘కాంతార’ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ‘కాంతార-2’తో బిజీగా ఉన్న రిషబ్, తన తదుపరి చిత్రాలను తెలుగు దర్శకులతో చేస్తుండటం విశేషం. ఇప్పటికే ప్రశాంత్ వర్మతో తన మొదటి తెలుగు సినిమాని ప్రకటించాడు. ‘హనుమాన్’కి సీక్వెల్ కి రూపొందుతోన్న ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రలో రిషబ్ కనువిందు చేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. ఇక రిషబ్ తన రెండో తెలుగు సినిమాకి కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.

‘ఆకాశవాణి’ మూవీ ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రిషబ్ శెట్టి తన రెండవ తెలుగు సినిమాని కమిట్ అయ్యాడట. ‘జై హనుమాన్’ లాగానే ఇది కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముంది అంటున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here