ప్రముఖ గీత రచయిత కులశేఖర్‌ కన్నుమూత!

ప్రముఖ గీత రచయిత కులశేఖర్‌ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్‌ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1971 ఆగస్ట్‌ 15న సింహాచలంలో జన్మించిన కులశేఖర్‌కు చిన్నతనం నుంచీ సాహిత్యంపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే పాటలు రాసి బహుమతులు అందుకున్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఈటీవీ గ్రూప్‌లో విలేకరిగా పనిచేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద శిష్యరికం చేయడం ద్వారా సినిమా పాటలకు సంబంధించిన మెళకువలు తెలుసుకున్నారు. 

ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై తేజ దర్శకత్వంలో రూపొందిన ‘చిత్రం’ ద్వారా పాటల రచయితగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తేజ, ఆర్‌.పి.పట్నాయక్‌లతో కలిసి ఎన్నో సినిమాలకు గీత రచయితగా పనిచేశారు. జయం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా, వసంతం, రామ్మా చిలకమ్మా, వసంతం, మృగరాజు, సుబ్బు, దాదాగిరి వంటి సినిమాల్లో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ రాశారు. వెంకటేష్‌ హీరోగా వచ్చిన ఘర్షణ చిత్రానికి మాటలు కూడా రాశారు. ఆయన కెరీర్‌లో దాదాపు 100 పాటలు రాశారు. అంతేకాదు, తెలుగువన్‌ సంస్థలో కూడా కొంతకాలం తన సేవలు అందించారు. కులశేఖర్‌ మృతి పట్ల తెలుగువన్‌ సంస్థ ఎం.డి. కంఠంనేని రవిశంకర్‌ తన సంతాపాన్ని తెలియజేశారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here