నటీనటులు: మేఘా ఆకాశ్, నరేశ్ అగస్త్య, రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, తారక్ పొన్నప్ప తదితరులు

రచన: తేజ దేశ్ రాజ్

ఎడిటింగ్: సాయి బాబు తళారి

మ్యూజిక్: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: షోయబ్ సిద్దిఖి

నిర్మాతలు: రామ్ తాళ్ళూరి

దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

ఓటీటీ: జీ 5 

నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన‌ డిటెక్టివ్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ (Vikkatakavi).  ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్‌ కు ‘స‌ర్వం శ‌క్తిమ‌యం’ ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. మంచి అంచనాలతో నేడు(న‌వంబ‌ర్ 28) ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సిరీస్ ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

కథ : 

రామకృష్ణ (నరేష్ అగస్త్య) డిటెక్టివ్. అతనిది హైదరాబాద్. కొన్ని కేసులు పరిష్కరించడానికి, కేసుల్లో చిక్కుముడులు విప్పడానికి పోలీసులు సైతం అతని సహాయం తీసుకుంటారు. రామకృష్ణ తెలివితేటలు చూసి తమ ఊరిలో సమాధానం లభించని ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారం వెతికే సత్తా అతనికి ఉందని ఓ ప్రొఫెసర్ భావిస్తాడు. రామకృష్ణ తల్లికి అరుదైన వ్యాధితో బాధ పడుతుంది. వర్షపు శబ్దం వింటే ఆమెలో అలజడి, భయం మొదలవుతాయి. తల్లికి ఆపరేషన్ చేయడానికి అవసరమైన డబ్బు వస్తుందన్న ఆశతో రామకృష్ణ అమరగిరి సంస్థానానికి వెళ్తాడు. అక్కడ దేవతల గుట్ట (కొండ) మీదకు రాత్రివేళల్లో వెళ్లిన జనాలు గతం మర్చిపోతారు. అది అమ్మోరు శాపమని అమరగిరి ప్రజలు భావిస్తారు. అది నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి రామకృష్ణ ఓ రోజు కొండ మీదకు వెళ్తాడు. ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ.

విశ్లేషణ:

ఈ సిరీస్ మొత్తంగా ఆరు ఎపిసోడ్ లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి ముప్పై అయిదు నుండి నలభై నిమిషాల వరకు ఉంది. 1970 లలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. ఈ సిరీస్ రెగ్యులర్ డిటెక్టివ్ థ్రిల్లర్స్ లేదు. కథలో వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యానికి తగ్గట్టుగానే మొదటి సన్నివేశం నుంచే ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా కథను ముందుకు తీసుకెళ్ళారు. రెండు, మూడు ఎపిసోడ్ లలో కొన్ని క్యారెక్టర్లు ఎందుకు ఉంచారా? అనే అనుమానం చూసే ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే చివరి ఎపిసోడ్ లో వాటికి లింక్ చేస్తూ వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి.

రొమాంటిక్ సీన్లు, అశ్లీల పదాలకి జోలికి పోకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ట్విస్ట్ లు, అవి పంచే థ్రిల్ ని ఆడియన్స్ కి ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. పాత్రలను మలిచిన తీరు బాగుంది. అలాగే నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. కొన్ని సీన్స్ లో కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపించినా, ఆ చిన్న చిన్న లాజిక్స్ ని వదిలేసి చూస్తే.. చివరి వరకు సిరీస్ ఎంగేజ్ చేస్తుంది. ప్రత్యేకించి ఈ సిరీస్ థ్రిల్లర్ లవర్స్ కి బాగా నచ్చేస్తుంది. 

1970 బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కాబట్టి దానికి తగ్గట్టుగా ఆర్ట్ వర్క్ బాగా చేశారు. షోయబ్ సిద్దిఖి సినిమాటోగ్రఫీ మెప్పించింది. అమరగిరి ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. సాయి బాబు ఎడిటింగ్ నీట్ గా ఉంది. బిజిఎమ్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

రామకృష్ణగా నరేశ్ అగస్త్య, లక్ష్మీగా మేఘా ఆకాశ్ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే రఘుపతిగా రఘు కుంచె బలమైన పాత్రలో మెప్పించారు. ఇక మిగతావారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా.. 

థ్రిల్ ని పంచే వికటకవి. మస్ట్ వాచెబుల్. 

రేటింగ్ : 3/5

✍️. దాసరి మల్లేశ్

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here