భారీ సినిమా చేస్తే సరిపోదు. దానిని అదే స్థాయిలో ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడే హీరో మార్కెట్ పెరగడంతో పాటు, సినిమా వసూళ్లు పెరిగి.. నిర్మాతలు, బయ్యర్లు లాభపడతారు. దాంతో మరిన్ని భారీ సినిమాలు వచ్చి, సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ స్థాయిలో సినిమాలను ప్రమోట్ చేస్తున్నవారు ఎందరు?. నిజంగా ఈ విషయంలో అల్లు అర్జున్ ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి. (Allu Arjun)
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా సినిమాలుగానే విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాల పాన్ ఇండియా ప్రమోషన్ కేవలం పోస్టర్లలకే పరిమితమవుతుంటే, మరికొన్ని మాత్రం ప్రెస్ మీట్లకు పరిమితమవుతున్నాయి. ప్రెస్ మీట్ ల వల్ల కూడా పెద్దగా ఒరిగేది లేదు. ఎందుకంటే ప్రెస్ మీట్ ల వల్ల ఎక్కువమందికి సినిమా చేరువ కాదు. అదే ఒక పెద్ద ఈవెంట్ జరిపితే ఆ హంగామానే వేరు. ఎక్కువ మంది ఆ ఈవెంట్ గురించి, ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. దాంతో సినిమాకి బోలెడంత పబ్లిసిటీ వస్తుంది. సినిమా చూడాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పుడు ‘పుష్ప-2’ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఇదే ఫాలో అవుతున్నాడు. (Pushpa 2 The Rule)
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప-1’కి కొనసాగింపుగా వస్తున్న సినిమా ‘పుష్ప-2’. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ ప్రమోట్ చేస్తున్న తీరు అమోఘం. పాట్నా, చెన్నై, కొచ్చి ఇలా మూడు నగరాల్లో మూడు భారీ ఈవెంట్ లను నిర్వహించారు. ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనే ఆ స్థాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ లు జరపడంలేదు. అలాంటిది ఇతర రాష్ట్రాలతో ఈ స్థాయి ఈవెంట్ లు జరపడం అనేది నిజంగా గొప్ప విషయం. ఈ ఈవెంట్ ల వల్ల ఆయా రాష్ట్రాల వారు ‘పుష్ప-2’ని మరింత ఓన్ చేసుకుంటున్నారు. అలాగే ఈవెంట్ ల వల్ల ‘పుష్ప-2’ పేరు దేశవ్యాప్తంగా మారుమాగిపోతోంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా చరిత్రలోనే ‘పుష్ప-2’ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. అది ప్రమోషన్స్ కి ఉన్న పవర్.
తన సినిమాని దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయడానికి అల్లు అర్జున్ శాయశక్తులా కష్టపడుతున్నాడు. ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. మిగతా స్టార్స్ కూడా పాన్ ఇండియా సినిమా అంటూ ఇతర రాష్ట్రాల్లో ఏదో మొక్కుబడి ప్రెస్ మీట్లతో సరిపెట్టకుండా.. అల్లు అర్జున్ ని చూసి వీలైనంత త్వరగా తమ తీరుని మార్చుకొని, ‘పుష్ప-2’ స్థాయిలో ప్రమోట్ చేసుకోవాలి.