కొత్తగూడ, గంగారం మండలాల్లో హైటెన్షన్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం చల్పాక ఫారెస్ట్ ఏరియాలో ఆదివారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. కానీ ఉదయం 11 గంటలు దాటిన తరువాత కూడా కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో ఎన్ కౌంటర్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ చివరకు ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కాగా ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు చల్పాక అటవీ ప్రాంతం నుంచి మహబూబాబాద్ జిల్లా వైపు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొత్తగూడ, గంగారం అటవీ ప్రాంతంలో కూడా పోలీసు బలగాలు, గ్రే హౌండ్స్, యాంటీ నక్సల్స్ టీమ్స్ భారీగా మోహరించాయి. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు చేపడుతూ మావోయిస్టుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు. దీంతో అటు ములుగు జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో కూడా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందటి వరకు సైలెంట్ గా ఉన్న అటవీ ప్రాంతంలో చాలాకాలం తరువాత బాంబుల మోత వినిపిస్తుండటంతో గొత్తి కోయలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనాల్లో కూడా భయాందోళన వ్యక్తమవుతోంది.