రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ పనులకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతి తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. మొత్తం 23 అంశాల అజెండాతో జరిగిన ఈ సమావేశంలో రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి, రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ అనుమతించిందన్నారు. ఇక అమరావతిలో గెజిటెట్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు భవనాల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 15లోపు ఐదు ఐకానిక్ టవర్లకు డిజైన్లు అందిస్తారని, నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామన్నారు.