చాలా కాలం తర్వాత అక్కినేని ఫ్యామిలీలో ఓ శుభకార్యం జరగబోతోంది. గత కొన్నిరోజులుగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకను సంప్రదాయ బద్ధంగా జరిపారు. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియ రానే వచ్చింది. డిసెంబర్‌ 4 రాత్రి గం.8.13లకు ఈ జంట వివాహ బంధంలోకి వచ్చేందుకు ముహూర్తం నిర్ణయించారు. హిందూ బ్రాహ్మణ సంప్రదాయంలో వీరి వివాహాన్ని జరపాలని పెద్దలు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో చైతన్య, శోభిత వివాహం చాలా గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వివాహానికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారని తెలుస్తోంది. ఇండస్ట్రీలోని కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు వివాహ సమయంలో ఉంటారు. అలాగే డి.రామానాయుడు కుటుంబంలోని వారంతా హాజరవుతున్నారు. నాగార్జునకు సంబంధించి కొందరు బిజినెస్‌ పార్టనర్స్‌ కూడా హాజరవుతున్నారు. 300 నుంచి 400 మంది మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 

బుధవారం రాత్రి జరగబోతున్న చైతన్య, శోభిత పెళ్ళికి సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి. అవేమిటంటే.. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌, హల్దీ ఫంక్షన్‌ను ఎలాంటి ఆర్భాటం లేకుండా జరిపారు. రేపు జరగబోయే పెళ్లి తంతుకు మాత్రం ఎంతో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నాగచైతన్య తనకు కాబోయే భార్యకు ఖరీదైన బహుమతులు అందించారు. రూ.1 కోటికిపైగా ఖరీదైన లెక్సస్‌ కారును బహూకరించారు. అలాగే లెక్కకు మించిన ఖరీదైన బంగారు ఆభరణాలను కూడా శోభిత కోసం తీసుకున్నారని తెలుస్తోంది. శోభితతో తన పెళ్ళి సందర్భంగా నాగచైతన్య స్పందిస్తూ ‘ఎంతో సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చింది శోభిత. ఆ కుటుంబం వారు నన్ను కొడుకులా చూసుకుంటారు. పెళ్లి తర్వాత శోభిత సినిమాల్లో నటిస్తుందా.. అని చాలా మంది అడుగుతున్నారు. పెళ్లి తర్వాత ఖచ్చితంగా సినిమాల్లో నటిస్తుంది’ అని క్లారిటీ ఇచ్చారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here