నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) సినీ రంగ ప్రవేశం కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మొదటి సినిమా ప్రకటన వచ్చింది. ఎస్ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న లాంచ్ కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మూవీ లాంచ్ వాయిదా పడింది. దీంతో అసలేం జరిగింది? ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అన్ స్టాపబుల్ షోతో బాలకృష్ణకు, ప్రశాంత్ వర్మకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ప్రశాంత్ ప్రతిభకు ఫిదా అయిన బాలయ్య, ఏకంగా తన తనయుడు మోక్షజ్ఞ ను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. ప్రశాంత్ కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ‘హనుమాన్’ తర్వాత స్టార్స్ తో సినిమాలు చేసే అవకాశమున్నా, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్ట్ చేయడం మరింత గౌరవంగా భావించాడు. అందుకే ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ కేర్ తీసుకుంటూ, చాలారోజులుగా మోక్షుతో ట్రావెల్ అవుతున్నాడు. అలాగే మోక్షజ్ఞ లుక్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే ప్రత్యేక ఫొటోషూట్ లు నిర్వహించి, పిక్స్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై నందమూరి అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ రోజురోజుకి ఆసక్తి పెరుగుతోంది. అలాంటిది ఈ మూవీ లాంచ్ జరగకపోవడం, మరోవైపు అసలు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వార్తలు రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

నిజానికి డిసెంబర్ 5న మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్ కోసం రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాట్లు చేశారు. లాంచ్ ఈవెంట్ లో మోక్షు కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో కూడా ప్రశాంత్ దగ్గరుండి డిజైన్ చేయించాడట. అయితే అనుకోకుండా ముందురోజు మోక్షజ్ఞ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కాసేపు మోక్షజ్ఞ వచ్చి వెళ్తే చాలు, మిగతా ఈవెంట్ ని జరిపించవచ్చని మొదట అనుకున్నారు. కానీ, మొదటి సినిమా లాంచ్ కి మోక్షజ్ఞ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా, మొక్కుబడిగా చేసేస్తే బాగుండదని బాలకృష్ణ భావించారు. ఇదే ప్రశాంత్ వర్మ దృష్టికి తీసుకెళ్లి, లాంచ్ ని వాయిదా వేశారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు, కేవలం మూవీ లాంచ్ వాయిదా పడింది. త్వరలోనే మరో మంచి ముహూర్తంతో ఘనంగా లాంచ్ కానుంది. మరోవైపు బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ అనారోగ్యం కారణంగానే సినిమా లాంచ్ వాయిదా వేశామని ప్రకటించారు. దీంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనే వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here