Gaddar Cine Awards : ఈ ఉగాదికి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది, అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సచివాలయంలో గద్దర్ అవార్డుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి, ప్రశంసిస్తూ అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక, విద్యా, సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం, మానవతా విలువలతో కూడిన చిత్రాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో గద్దర్ అవార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.