అక్కినేని అభిమానులు కొంతకాలంగా తీవ్ర నిరాశలో ఉన్నారు. మిగతా సీనియర్ స్టార్స్ తో పోలిస్తే నాగార్జున తన స్థాయికి తగ్గ హిట్ కొట్టి చాలా కాలమైంది. దానికితోడు ప్రస్తుతం నాగార్జున హీరోగా సినిమాలు చేయకుండా.. ‘కుబేర’, ‘కూలీ’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇక ఎన్నో అంచనాల నడుమ సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్, ఇంతవరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా అందుకోలేదు. ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా మొదలుపెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. దీంతో అక్కినేని అభిమానులు నాగచైతన్య పైనే ఆశలు పెట్టుకున్నారు. చైతన్య గత చిత్రాలు ‘థాంక్యూ’, ‘కస్టడీ’ నిరాశపరిచినప్పటికీ.. ‘తండేల్’తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఎంతో నమ్మకంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు అభిమానులు ఈ సినిమాలో విషయంలో కూడా రోజురోజుకి నమ్మకం కోల్పోతూ నిరాశ చెందుతున్నారు. (Naga Chaitanya)
నిజానికి ‘తండేల్’ పై మొదట్లో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘కార్తికేయ-2’ వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, ‘లవ్ స్టోరీ’ తర్వాత నాగచైతన్య-సాయిపల్లవి జోడీగా నటిస్తుండటంతో ‘తండేల్’ అందరి దృష్టిని ఆకర్షించింది. దానికితోడు వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ ఆ అంచనాలను మేకర్స్ తుంచుకుంటూ వస్తున్నారనే అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. (Thandel)
‘తండేల్’ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఒక అగ్ర నిర్మాణ సంస్థ నుంచి సినిమా వస్తుందంటే ఒకట్రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ ‘తండేల్’ విషయంలో గీతా ఆర్ట్స్ వ్యవహరిస్తున్న తీరుపై అక్కినేని అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ డిసెంబర్ లో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ ఉండటం మరియు ఏవో ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు. దీంతో సంక్రాంతికి విడుదలవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఉండటంతో.. నిర్మాత అల్లు అరవింద్ ‘తండేల్’ను ఫిబ్రవరి 7కి పోస్ట్ పోన్ చేశారు. సంక్రాంతికి విడుదల చేసే అవకాశమున్నా అలా వాయిదా వేయడంతో.. ఆ సమయంలో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరైతే సోషల్ మీడియా వేదికగా గీతా ఆర్ట్స్ తీరుని తప్పుబట్టారు. పోనీ ఫిబ్రవరి 7న ‘తండేల్’ విడుదలవుతుంది, ప్రమోషన్స్ అయినా ఓ రేంజ్ లో ఉన్నాయా? అంటే.. అదీ లేదు. దీంతో ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోయింది. విడుదలకు ఇంకా రెండు వారాలే ఉంది. ఇంతవరకు సరైన ప్రమోషనే లేదు. జనరల్ ఆడియన్స్ కి అసలు ఈ సినిమా విడుదల గురించి సరైన అవగాహనే లేదు. దీంతో థియేటర్ లో రిలీజ్ చేయడానికి ఈ సినిమా తీశారా? లేక నేరుగా ఓటీటీ రిలీజ్ చేసుకోవడానికి తీసుకున్నారా? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
నాగచైతన్యకు ‘తండేల్’ విజయం కీలకం. పైగా చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అలాంటి సినిమాను కనీస స్థాయిలో ప్రమోషన్స్ చేయకుండా, ఉన్న బజ్ ను కూడా పోగొడుతున్నారని అక్కినేని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఎవరైనా తమ సినిమాని బాగా ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటారు.. కానీ ‘తండేల్’ విషయంలో మాత్రం కావాలని తొక్కేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.