2004లో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ చిత్రం ద్వారా కమెడియన్‌గా పరిచయమైన వేణు ఆ తర్వాత 200 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో వేణు వండర్స్ అనే టీమ్‌ను ఏర్పాటు చేసుకొని స్కిట్స్ చేశారు. 2023లో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బేనర్లో తన దర్శకత్వంలో రూపొందించిన ‘బలగం’ అనూహ్య విజయం సాధించింది. పల్లె కథలు, మనసును హత్తుకునే తెలుగు నేటివిటీ సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఆ సినిమా నిరూపించింది. ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసుల్ని తట్టి లేపింది. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని సన్నివేశాలు అందరి గుండెల్ని తాకాయి. దర్శకుడుగా తన తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించిన వేణు తన తదుపరి సినిమా కోసం కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ త్వరలోనే వస్తుందని తెలియజేసే ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో వేశారు. అయితే ఆ పోస్ట్‌లో కథపై కాకుండా తను వ్యక్తిగతంగా జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫోటోను షేర్ చేసి ఆసక్తి రేకిస్తున్నారు. ఆ పోస్ట్‌లో ‘సిద్ధమవుతున్నా.. త్వరలో అప్డేట్ వస్తుంది’ అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు.
జిమ్‌లో కసరత్తు చేస్తూ తనకు తాను ఒక కొత్త లుక్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ పోస్ట్ ద్వారా తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్‌రాజే ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు స్క్రిప్ట్‌కి సంబంధించిన వర్క్ పూర్తయిందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతోంది. ‘ఎల్లమ్మ’ అనే టైటిల్లోనే తెలంగాణ నేపథ్యం కనిపిస్తోంది. ఈ సినిమాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ ప్రధాన పోషిస్తారు. హీరోయిన్గా సాయి పల్లవిని ఎంపిక చేశారని సమాచారం. వాస్తవానికి ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో నాని. కొన్ని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నితిన్‌కి ఆ అవకాశం దక్కింది.