నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం.. నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మోక్ష‌జ్ఞ మొదటి సినిమా ప్రకటన కూడా వచ్చింది. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రకటన వచ్చి ఆరు నెలలవుతున్నా.. ఇంతవరకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పట్టాలెక్కలేదు. (Nandamuri Mokshagna)

 

మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా మధ్యలో వార్తలొచ్చాయి. మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని, ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అసలు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా? ఇస్తే ఎప్పుడు? దర్శకుడు ప్రశాంత్ వర్మేనా లేక మరొకరా? ఇలా రకరకాల ప్రశ్నలు నందమూరి అభిమానులను వేధిస్తున్నాయి. అయితే వాటన్నింటికీ సమాధానం దొరకబోతుంది.

 

మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారాన్ని నమ్మొద్దని, అవన్నీ తప్పుడు వార్తలని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని తెలుస్తోంది. కానీ, పట్టాలెక్కడానికి మాత్రం కాస్త సమయం పడుతుందట. 

 

ప్రస్తుతం ‘హనుమాన్’కి సీక్వెల్ గా.. కన్నడ హీరో రిషబ్ శెట్టితో ‘జై హ‌నుమాన్‌’ మూవీ చేస్తున్నాడు దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఆ సినిమా పూర్తయ్యాక, మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ని మొదలు పెడతాడట. ఈలోపు మోక్ష‌జ్ఞ కూడా యాక్టింగ్, డ్యాన్స్ త‌దిత‌ర విభాగాల్లో శిక్షణ పొంది.. పూర్తి స్థాయిలో సిద్ధమవుతాడట. కాస్త ఆలస్యమైనా.. ముందుగా అనుకున్నట్టు, మోక్ష‌జ్ఞ డెబ్యూ బాధ్యతను ప్ర‌శాంత్ వ‌ర్మ‌కే అప్పగించాలని బాల‌కృష్ణ‌ నిర్ణయించుకున్నారట. మోక్షజ్ఞ డెబ్యూకి ఈ సబ్జెక్టే కరెక్ట్ అని బాలయ్య భావిస్తున్నారట. 

 

అన్నీ అనుకున్నట్టు జరిగితే.. నందమూరి అభిమానుల ఎదురుచూపులు వచ్చే ఏడాది ఫలించనున్నాయి. ఎందుకంటే, మోక్ష‌జ్ఞ మొదటి చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here