ప్రస్తుతం ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒకే ఒక్క హీరో పేరు అల్లు అర్జున్‌. ‘పుష్ప’ చిత్రం సాధించిన ఘనవిజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న బన్నీకి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు రావడంతో మరింత పాపులర్‌ అయిపోయారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎంతో మంది మహానటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నప్పటికీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ఎవరూ సాధించలేకపోయారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చిన 20 సంవత్సరాల్లోనే ఆ ఘనత సాధించిన హీరోగా రికార్డుల కెక్కారు బన్నీ. 

ఇక ‘పుష్ప2’ కలెక్షన్‌ సునామీ సృష్టించి అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ వెనక్కి నెట్టేసి నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. గ్రాస్‌ పరంగా, నెట్‌పరంగా ఎవరూ టచ్‌ చేయలేని రికార్డును పుష్ప2 సొంతం చేసుకుంది. ఈ సినిమా ఘనవిజయంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా అల్లు అర్జున్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. అంతేకాదు, ఇటీవల ఐఎండిబి ఓ సర్వే నిర్వహించి టాప్‌ 25 ఇండియన్‌ హీరోస్‌ లిస్ట్‌ని రిలీజ్‌ చేసింది. అందులో నెంబర్‌ వన్‌ స్థానాన్ని అల్లు అర్జున్‌ దక్కించుకోవడం చూస్తే.. అతని క్రేజ్‌ ఎలా పెరిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి టాప్‌ హీరోలు 23, 25 స్థానాల్లో ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇలా రోజు రోజుకీ తన నెంబర్‌వన్‌ స్థానాన్ని పదిలపరుచుకుంటున్న బన్నీకి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. 

అమెరికాలో 1930లో స్థాపించిన ‘ది హాలీవుడ్‌ రిపోర్టర్‌’ అనే మ్యాగజైన్‌ అక్కడ ఎంతో పాపులర్‌. 2010 నుంచి ఈ పత్రికను డిజిటల్‌గా కూడా తీసుకొస్తున్నారు. లాస్‌ ఏంజిల్స్‌ కేంద్రంగా ప్రచురింపబడుతున్న ఈ మ్యాగజైన్‌ ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది. దీనికి సంబంధించిన మొదటి సంచిక కవర్‌పేజీని అల్లు అర్జున్‌కు కేటాయించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ హాలీవుడ్‌కి సైతం పోటీగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతి హాలీవుడ్‌ వరకు విస్తరించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియాలో ది హాలీవుడ్‌ రిపోర్టర్‌ మ్యాగజైన్‌ తప్పనిసరి అని భావించిన యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మ్యాగజైన్‌ మొదటి సంచికలో అల్లు అర్జున్‌ కవర్‌ స్టోరీని ప్రచురించారు. అంతేకాదు బన్నీ కవర్‌ పేజీపై దర్శనమిచ్చాడు. అలాగే డిజిటల్‌ మ్యాగజైన్‌లో కూడా బన్నీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక తెలుగు హీరో హాలీవుడ్‌ మ్యాగజైన్‌ కవర్‌ స్టోరీ వరకు వెళ్ళడం అనేది ఒక రేర్‌ ఫీట్‌ అనే చెప్పాలి. దాన్ని సాధించిన అల్లు అర్జున్‌ని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ వైరల్‌గా మారింది. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here