వెజిటెబుల్ కబాబ్‌లను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- పచ్చి బఠానీ లేదా చిక్కుల్లు – ఒక కప్పు
- క్యారెట్ – ఒక కప్పు
- క్యాబేజ్ – ఒక కప్పు
- శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు
- కారం పొడి- అర టీస్పూన్
- పసుపు- పావు టీస్పూన్
- ధనియాల పొడి- పావు టీస్పూన్
- గరం మసాలా- పావు టీస్పూన్
- పచ్చిమిర్చీ- 2 లేదా 3
- రుచికి సరిపడా ఉప్పు
- నూనె- ఫ్రైకి సరిపడా
- కొత్తిమీర – పావు కప్పు
- టూత్ పిక్స్ లేదా కబాబ్ స్టిక్స్
వెజిటెబుల్ కబాబ్ తయారీ విధానం..
- వెజిటెబుల్ కబాబ్ లను తయారు చేసుకోవడానికి ముందుగా చిక్కుళ్లు లేదా పచ్చి బఠానీలను శుభ్రంగా కడిగి కాసేపు ఉడికించండి.
- తర్వాత వీటిని చల్లారబెట్టి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి పేస్టులా తయారు చేసుకోండి.
- ఇప్పుడు ఈ మిశ్రమంలోనే సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్, సన్నగా గుండ్రంగా కట్ చేసి పెట్టుకన్న పచ్చిమిర్చీ వేసి కలపండి.
- తర్వాత దీంట్లోనే శనగపిండి, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర తురుముతూ పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి అన్ని కలిసిపోయేంత వరకూ బాగా కలపండి. కూరగాయల్లోనే నీరు ఉంటుంది కనుక ఈ పిండిని కలపడానికి మీకు నీరు అవసరం ఉండదు.
- పిండంతా బాగా కలిసిన తర్వాత ఉప్పు, కారం మీకు సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కావాలంటే కలుపుకోండి. తర్వాత కలపడం కుదరదు.
- అన్నీ కలుపుకున్న తర్వాత ఈ పిండిని కబాబ్‌ల షేపులో తయారు చేసుకొని టూత్ పిక్స్ లేదా కబాబ్ స్టిక్స్‌కి గుచ్చండి.
- ఇలా మిగిలిన మొత్తం పిండితో కబాబ్ లను తయారు చేసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాని మీద రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయండి.
- నూనె వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కబాబ్‌లను ప్యాన్ మీద పెట్టి అటు ఇటు తిప్పుడూ కాల్చండి.
అంతే రెస్టారెంట్ స్టైల్ కబాబ్ లు రెడీ అయినట్టే. రెసిపీ సింపుల్‌గా ఉంది కదా రుచిగా ఉండదేమో అనుకుంటే పొరపడినట్టే. ఒకసారి రుచి చూశారంటే ఇక రెస్టారెంట్లో తినడం మానేస్తారు. వీటిని టమాటో కెచప్ లేదా పెరుగుతో కలిపి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేయించుకుని తింటారు. ట్రై చేసి ఎంజాయ్ చేయండి.