50 సంవత్సరాలుగా టాలీవుడ్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న నందమూరి బాలకృష్ణకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు అని ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాతో రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టిన బాలయ్య ఈసారి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. బాలయ్య పెర్ఫార్మెన్స్, బాబీ టేకింగ్ వెరసి సినిమా సూపర్‌హిట్ అయింది. ఇటీవలే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. ఓటీటీలో థియేటర్లను మించి ఈ సినిమాకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా తమిళ్, మలయాళ ప్రేక్షకులు డాకు మహారాజ్‌ను ఎక్కువగా చూస్తున్నారని తెలుస్తోంది.
మలయాళ ప్రేక్షకులు డాకుకి బ్రహ్మరథం పడుతున్నారు. అల్లు అర్జున్‌కి కేరళలో ఎప్పటి నుంచో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను నటించిన ప్రతి సినిమా అక్కడ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా మూవీ పుష్ప తర్వాత అక్కడ బన్నీ క్రేజ్ మరింత పెరిగింది. అయితే పుష్ప2 చిత్రంతో బన్నీపై అక్కడ కొంతవరకు వ్యతిరేకత వచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఫహద్ కేరళకు చెందినవాడు. ఈ సినిమాలో అతనిపై మూత్రం పోసే సన్నివేశం చూసిన కేరళ ఆడియన్స్ చాలా హర్ట్ అయ్యారట. ఆ సినిమా తర్వాత వచ్చిన డాకు మహారాజ్ తమకు బాగా నచ్చిందని, పుష్ప2 కంటే బాగుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. డాకు మహారాజ్ వేస్ట్ సినిమా అనీ, మలయాళ ప్రేక్షకులు ఎందుకు ఆ సినిమాని ఎత్తేస్తున్నారో అర్థం కావడం లేదని ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు. ఆ వీడియో కింద అతన్ని తిడుతూ వేలాది మెసేజ్‌లు పెట్టారు కేరళ అభిమానులు. బాలయ్య సినిమాను ఏమైనా అంటే మర్యాద ఉండదు అంటూ రకరకాల కామెంట్స్‌తో ఆ యూట్యూబర్‌ని ట్రోల్ చేస్తున్నారు. మనదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా డాకు మహారాజ్‌ను ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారట. తన కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ చూసిన బాలకృష్ణకు డాకు మహారాజ్ సక్సెస్ ఇస్తున్న ఆనందం ఓ కొత్త అనుభూతి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.