తెర మీద అందంగా కనిపించి, ప్రేక్షకులను అలరించడమే కాదు.. తెర వెనుక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అందమైన మనసున్న మనిషి కూడా అనిపించుకుంది ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా. బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా పేరున్న ఊర్వశి.. టాలీవుడ్ లోనూ పలు స్పెషల్ సాంగ్స్ లో మెరిసి, తన గ్లామర్ ఇమేజ్ ను నిరూపించుకుంది. అయితే నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘డాకు మహారాజ్’లో కేవలం స్పెషల్ సాంగ్ కి పరిమితం కాకుండా.. ఎస్ఐ జానకి పాత్రలో అలరించి, నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఇప్పుడు తన మంచి మనసుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మహా శివరాత్రి మరియు తన పుట్టినరోజు సందర్భంగా ఊర్వశి రౌతేలా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ తరఫున 251 మంది అనాథ అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించింది. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం.
సామూహిక వివాహ వేడుక ఏర్పాట్లను ఊర్వశి రౌతేలా దగ్గరుండి చూసుకోవడమే కాకుండా, అందరికీ స్వయంగా భోజనాలు కూడా వడ్డించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఊర్వశిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కన్యాదానం అనేది గొప్ప విషయం. అలాంటిది ఏకంగా 251 మంది అనాథ అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించడం అనేది ఊర్వశి రౌతేలాకు గొప్ప వరం లాంటిదని చెప్పవచ్చు. అనాథ అమ్మాయిలకు ఒక సోదరిలా తాను వివాహాలు జరిపించాలనే ఆలోచన ఆమెకు రావడం అభినందించదగ్గ విషయం. ఆ ఆలోచనను ఏదో తూతూ మంత్రం అన్నట్టుగా చుట్టేయకుండా.. అద్భుతమైన ఏర్పాట్లు చేసి, పురోహితుల సమక్షంలో, సంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా వివాహాలను జరిపించింది. దీంతో ఊర్వశి రౌతేలాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.