ఒక హీరో ఇమేజ్‌ ఏ స్థాయిలో ఉంది, అతనికి ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది అనే విషయాలు అతను చేసిన సినిమాలు సాధించిన కలెక్షన్లు నిరూపిస్తాయి. అయితే రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాలంటే ఏ హీరోకైనా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. కొందరికి దశాబ్దాలు కూడా పట్టొచ్చు. ఇండియాలో ఇప్పుడున్న టాప్‌ హీరోల సినిమాలు వందల కోట్లు కలెక్ట్‌ చేసే స్థాయికి చేరుకున్నాయి. స్టార్‌ హీరోల సినిమాలు సునాయాసంగా మినిమం 100 కోట్లు కలెక్ట్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్స్‌ అయినా, టాలీవుడ్‌ స్టార్స్‌ అయినా ఆ ఫీట్‌ సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒకప్పటి సినిమాలకు, ఇప్పటి సినిమాలకు మేకింగ్‌ పరంగా, టెక్నికల్‌గా చాలా డిఫరెన్స్‌ ఉంది. దాంతో బడ్జెట్‌ కూడా ఆ స్థాయిలోనే పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. వందల కోట్లు పెట్టి సినిమా తీసిన కొందరు నిర్మాతలకు ఆ స్థాయిలోనే కలెక్షన్లు వస్తున్నాయి. వందల కోట్లలో వసూళ్లు సాధించినా ఆ సినిమా హిట్‌ అని చెప్పాలా, ఫ్లాప్‌ అని చెప్పాలా అంటే కొంచెం ఆలోచించాల్సిందే. 

హిట్‌, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మినిమం గ్యారెంటీ కలెక్షన్లు సాధించగల హీరోలు కొందరున్నారు. వారిలో దళపతి విజయ్‌ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో చాలా మంది హీరోలు 200 కోట్ల మార్క్‌ని అందుకున్నారు. అయితే విజయ్‌ అలా 8 సార్లు 200 కోట్ల మార్క్‌ని దాటాడు. అందులోనూ ఏడుసార్లు వరసగా 200 కోట్ల సినిమాలు చేయడం విశేషం. 2017లో ఈ వరస విజయాల పరంపర మొదలైంది. అట్లీ దర్శకత్వంలో విజయ్‌ చేసిన ‘మెర్సల్‌’ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లు కలెక్ట్‌ చేసింది. 2018లో ఎ.ఆర్‌.మురుగదాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘సర్కార్‌’ కూడా అదే స్థాయి విజయం సాధించి 252 కోట్లు సాధించింది. 2019లో మరోసారి అట్లీ దర్శకత్వంలో వచ్చిన ‘బిగిల్‌’ కూడా మంచి కలెక్షన్లు సాధించడంతో 200 కోట్ల మార్క్‌ని దాటాడు విజయ్‌. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 295 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2021లో లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మాస్టర్‌’ చిత్రం కూడా 223 కోట్లు వసూలు చేయడంతో మరోసారి 200 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేశాడు విజయ్‌. 2022లో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌లో విజయ్‌ చేసిన ‘బీస్ట్‌’ కూడా 216 కోట్లు సాధించింది. 

2023లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘వరిసు’ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 297 కోట్లు కలెక్ట్‌ చేసింది. 2023లోనే లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘లియో’ విజయ్‌ చేసిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇండియాలో 320 కోట్లు కలెక్ట్‌ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 620 కోట్లు వసూలు చేసింది. గత ఏడాది వెంకట్‌ప్రభు దర్శకత్వంలో విజయ్‌ చేసిన ‘ది గోట్‌’ చిత్రం కూడా 200 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేసింది. ఇలా వరసగా విజయ్‌ నటించిన ఏడు సినిమాలు 200 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేశాయి. అయితే ఈ సినిమాల బడ్జెట్లు కూడా ఆ స్థాయిలోనే ఉండడం గమనార్హం. సినిమాకి ఎలాంటి టాక్‌ వచ్చినా 100 నుంచి 150 కోట్లు కలెక్ట్‌ చేయగల సామర్థ్యం ఉన్న హీరోగా విజయ్‌ రికార్డులకెక్కాడు. ఇండియన్‌ సినిమాలో ఇప్పటివరకు వరసగా ఎనిమిది సార్లు 200 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేసిన ఏకైక హీరోగా విజయ్‌ రికార్డు సృష్టించాడు. 

తాజాగా విజయ్‌ ‘జన నాయగన్‌’ చిత్రం చేస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తను సినిమాలను వదిలి రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే తన కొత్త పార్టీని కూడా ఆవిష్కరించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న విజయ్‌ నటిస్తున్న ‘జన నాయగన్‌’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడులో రజినీకాంత్‌ తర్వాత అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో విజయ్‌. అయితే తన అభిమానగణాన్ని రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్న అతను రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసే అవకాశం ఉందని విజయ్‌ అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే తన సినిమాలతో 8 సార్లు 200 కోట్ల మార్క్‌ని క్రాస్‌ చేసిన విజయ్‌ ‘జన నాయగన్‌’ చిత్రంతో 500 కోట్ల మార్క్‌ని కూడా క్రాస్‌ చేయడం కష్టమైన పని కాదని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here