నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ-SLBC సొరంగం సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. ఇటీవల 14వ కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో 8 మంది సిబ్బంది చిక్కుకుపోయారు. ఈ విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన 11 రోజులకు టన్నెల్‌లోని కన్వేయర్ బెల్ట్‌ను సాంకేతిక నిపుణులు ఎట్టకేలకు పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్ట్ పనిచేయడం ప్రారంభం అవటంతో బురద, మట్టి తొలగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 200 అడుగుల మేర పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టీబీఎం శిథిలాలు కారణంగా ఇప్పటి వరకు ఆ 8 మంది జాడను గుర్తించడం సాధ్యపడలేదు. అయితే అధికారులు అంచనా ప్రకారం, దాదాపు 6 వేల క్యూబిక్ మీటర్ల పూడికను పూర్తిగా తొలగించాల్సి ఉంది.