దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. 2019లో ఆయన రూపొందించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై మంగళగిరి, ఒంగోలు, అనకాపల్లిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ.. మరోసారి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. (Ram Gopal Varma)

 

విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే పలువురు ఫిర్యాదు చేశారు. 2019 లోనే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అని టైటిల్ మార్చి సినిమాను రిలీజ్ చేశారు. అయితే, యూట్యూబ్ లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతోనే విడుదల చేయడంపై మంగళగిరికి చెందిన బండారు వంశీకృష్ణ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందని, సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను కూడా తొలగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది.

 

ఈ కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు గ‌త నెల నోటీసులు పంపారు. కానీ, వర్మ విచార‌ణ‌కు హాజరు కాకుండా, త‌న న్యాయ‌వాదిని పంపించారు. సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నానని, త‌న‌కు 8 వారాల గ‌డువు కావాల‌ని కోరారు. ఈ క్రమంలో తాజాగా వ‌ర్మ‌కు సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు పంపించ‌డం గ‌మ‌నార్హం.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here